AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హస్తగతమవుతున్న మునిసిపాలిటీలు.. ఇక ఆదిలాబాద్ పై చూపు

నేడో రేపో మరో ముగ్గురు కౌన్సిలర్ల చేరిక

త్వరలో అవిశ్వాసం ఖాయమంటున్న కాంగ్రెస్ నేతలు

(అమ్మన్యూస్ ప్రతినిధి, ఆదిలాబాద్)
రాష్ట్రంలోని మునిసిపాలిటీలు వరుసగా హస్తగతమవుతున్నాయి. తాజాగా మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. వనపర్తి.. సూర్యాపేట జిల్లాలోని తిరుమల గిరితో పాటు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. బీఆర్ఎస్ కింద ఉన్న ఈ మూడు మున్సిపాలిటీలకు చెందిన నేతల్ని తమవైపు తిప్పుకోవటం ద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ఏలుబడిలోకి వెళ్లాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ కు చెందిన నేతలు సైతం కాంగ్రెస్ నేతలకు జై కొట్టటంతో మున్సిపాలిటీలు హస్తగతమవుతున్నాయి. అధికారపార్టీలోకి వెళ్ళకపోతే రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరం అవుతుందన్న ఆందోళన కౌన్సిలర్లు, కార్పోరేటర్లలో వ్యక్తమవుతోంది.

హస్తగతం కానున్న ఆదిలాబాద్

తాజాగా ఆదిలాబాద్ జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. జిల్లాలోని మునిసిపాలిటీలన్నీ వరుసగా హస్తగతమవుతుండగా, ఇపుడు ఆదిలాబాద్ వంతు వచ్చింది. ఖానాపూర్, కాగజ్ నగర్ , నిర్మల్ తో పాటు జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలలోనూ కాంగ్రెస్ ట్రెండ్ కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్ర మునిసిపాలిటీలోనూ.. కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అవిశ్వాసానికి తెరవెనుక సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో నాయకులు పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిని కలిసి రాజకీయ భవిష్యత్ పై హామీ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ వైపు ముగ్గురు కౌన్సిలర్లు నేడో రేపో మరో ముగ్గురు కౌన్సిలర్లు చేరబోతున్నారని నేతలు చెబుతున్నారు. మరో 12మంది కౌన్సిలర్లు సంప్రదింపులలో ఉన్నట్లు చెబుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ మునిసిపాలిటీపై ఆధిపత్యం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. రెండు దశాబ్దాల రామన్న రాజకీయ శకం ముగియడంతో నేతలు ప్రత్యామ్నాయాల కోసం పరుగులు తీస్తున్న పరిస్థితి నెలకొంది. రాజకీయమంటే.. అధికారపార్టీనే అన్న చందంగా పరిస్థితులు కేసీఆర్ హయాంలో మారడంతో అన్ని జిల్లాల్లోనూ ఒకే ట్రెండ్ నడుస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10