కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఈసారి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఎవరికి ఇస్తారోనని స్థానికంగా చర్చ కొనసాగుతోంది. ఇప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే టికెట్ కేటాయించే అవకాశం ఉంది. లాస్యనందిత సోదరి నివేదితకు దాదాపు టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. కంటోన్మెంట్ కు సంబంధించి అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ ఆదివారం చర్చించారు.
ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో హరీశ్ రావు, కేటీఆర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి, లాస్యనందిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నివేదితకు టికెట్ కేటాయించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థిపై కేసీఆర్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
లాస్యనందిత కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మే 13న కంటోన్మెంట్ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. శ్రీ గణేష్ కొద్ది రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ చేరారు. ఆయన గతంలో పోటీ చేసి ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో శ్రీ గణేష్ కు 41 వేల ఓట్లు వచ్చాయి. ఇక్కడ లాస్య నందిత, గద్దర్ కూతురు వెన్నెల, శ్రీ గణేష్ పోటీ చేశారు.
లాస్య నందిత శ్రీ గణేష్ పై 17,169 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్ గద్దర్ కూతురు వెన్నెలక టికెట్ ఇవ్వక.. శ్రీ గణేష్ కు ఇచ్చారు. బీజేపీ కూడా త్వరలో అభ్యర్థిని ప్రకటించనుంది.