రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని రాజ్యసభ ఎంపీ, మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లో రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను బీజేపీ నేతలు కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఫోన్ ట్యాపింగ్పై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్‌వీ సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దిగ్భ్రాంతిని కలిగిస్తోందని లక్ష్మణ్ అన్నారు. సూత్రధారులను పరిగణలోకి తీసుకోకుండా అసలు దోషులను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిస్తోందని ఆరోపించారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్ ప్రతిపక్షాలు, ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేసిందని విమర్శించారు. వ్యక్తుల భద్రత, స్వేచ్ఛను హరించేలా ఈ తతంగం జరిగిందని దుయ్యబట్టారు. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్తో రాజకీయ ప్రయోజనాలు పొందిందని లక్ష్మణ్ ఆరోపించారు. అధికార పార్టీ అభ్యర్థులకు పోలీస్ వాహనాల్లో డబ్బులు పంపిణీ చేయడం దుర్మార్గమని ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు.









