AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంటోన్మెంట్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేశ్‌

హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ అభ్యర్థిని కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన నారాయణన్‌ శ్రీగణేశ్‌ను (Sri Ganesh) హస్తం పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించింది. ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. ఆయన ఈ మధ్యే అధికార పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లాస్య నందిత విజయం సాధించారు. అయితే గత నెలలో ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతిచెందారు. దీంతో కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక అనివార్యమైంది.

మాజీ మంత్రి జే. గీతారెడ్డి శిష్యుడిగా సుపరిచితుడైన గణేశ్‌ 2014 ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం యత్నించారు. 2018 ఎన్నికల్లోనూ విశ్వప్రయత్నం చేశారు. అయితే ఆయనకు రెండుసార్లూ నిరాశే ఎదురైంది. దాంతో చివరి నిమిషంలో కాషాయ కండువా కప్పుకుని, గత ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు రావడంతో. మల్కాజిగిరి ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో బీఆర్‌ఎస్‌లో చేరారు.

2023 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌ తనకే దక్కుతుందని ఆశించారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే జీ. సాయన్న హఠాన్మరణం చెందడంతో ఆయన వారసురాలిగా కుమార్తె లాస్యనందితకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయించింది. దాంతో శ్రీగణేశ్‌ మళ్లీ బీజేపీ కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. లాస్యనందిత మృతి వల్ల త్వరలో జరిగే కంటోన్మెంట్‌ ఉపఎన్నికలో శ్రీగణేశ్‌ బీజేపీ నుంచి పోటీచేస్తారని అందరూ భావించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 40వేల ఓట్లు సాధించి, రెండోస్థానంలో నిలిచిన గణేష్‌.. ఉప ఎన్నికలో విజయం సాధిస్తారని బీజేపీ శ్రేణులు భావించాయి. అయితే అనూహ్యంగా ఆయన హస్తం గూటికి చేరారు.

ANN TOP 10