ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే..
తెలంగాణలో బీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తోంది. ఆ పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరిగా బయటకు వెళ్తుండడంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంటోంది. ఈ లోక్ సభ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీకి ఓటమి తప్పదని సర్వేలు అంచనా వేస్తున్నాయి. తాజాగా ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వేలో బీఆర్ఎస్ రెండు సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బీఆర్ఎస్ 2019 లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో 9 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం ఒక చోట విజయం సాధించాయి.
ఈసారి మాత్రం గులాబీ పార్టీ గడ్డుకాలమే ఉంటుందని సర్వేను బట్టి తెలుస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలో తేలింది. బీజేపీ గతం కంటే మెరుగుపడి 4 నుంచి 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఎప్పటిలాగానే ఎంఐఎం ఒక చోట విజయం సాధిస్తుందని సర్వే వెల్లడించింది. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే 1 నుంచి 30 వరకు నిర్వహించినట్లు తెలిపారు.కాంగ్రెస్ మాత్రం 14 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. అందుకోసం ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్ ఇంకా మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించ లేదు. అటు బీజేపీ కూడా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. బలమైన అభ్యర్థులను బరిలో నిలిపింది.