ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు శనివారం భుజంగరావు, తిరుపతన్నలను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. 48 గంటల పాటు జైల్లో ఉండడంతో వేటు పడింది. రాష్ట్రంలో సంచలనంగా మారుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులైన అడిషనల్ ఎస్పీలను చంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 2 వరకూ వీరిద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరపనున్నారు.
అయితే ఇప్పటికే డీఎస్పీ ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్ కాగా, వీరిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌ను, ఎస్ఐబీలో ఇన్ స్పెక్టర్‌గా పనిచేసిన గట్టుమల్లును కూడా అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీలో భుజంగరావు, తిరుపతన్నలను విచారించేటప్పుడు ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే భుజంగరావు తిరుపతన్నకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. ఇక వీరి స్టేట్ మెంట్ కీలకంగా మారనుండగా.. వీరు ఇచ్చిన సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.









