దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కరాలను ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. కాగా.. పలు రంగాల్లో అసాధారణ సేవలందించిన వారికి భారత ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేస్తోంది. అయితే, ఈ ఏడాది ఐదుగురు ప్రముఖులకు మూడు విడతల్లో అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది.
ఈ ఏడాదికి బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ప్రధాని చౌదరీ చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్నను ప్రకటించారు. ఒకే సంవత్సరంలో ఎక్కువమందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఇదే తొలిసారి.









