ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా బీఆర్‌ఎస్ పార్టీని వీడనని నాగర్‌కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పష్టం చేశారు. తాను గొర్రెను కాను.. కాలేనని.. ఇంకెక్కడి పోవాలన్న ఆలోచన కూడా లేదని ఆయన తెలిపారు. దయచేసి ఎవరూ టెన్షన్ పడవద్దని బీఆర్‌ఎస్ కార్యకర్తలకు సూచించారు. కడియం శ్రీహరి, కేకే వంటి సీనియర్ నేతలు బీఆర్‌ఎస్ పార్టీని వీడటంతో తనను కూడా వారి బాటలోనే నడవాలని పలువురు కాల్ చేసి చెబుతున్నారని నాగర్‌కర్నూలు పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీని వీడొద్దని.. ఈ పరిస్థితుల్లో అండగా నిలబడాలని మరికొంతమంది బీఆర్‌ఎస్ కార్యకర్తలు తనను కోరుతున్నారని చెప్పారు. కానీ తాను పార్టీ వీడనని స్పష్టం చేశారు.
తాను గతంలో చేసిన బీఎస్పీ-బీఆర్‌ఎస్ కూటమి ప్రయత్నం గానీ.. బీఆర్‌ఎస్‌లో చేరాలన్న నిర్ణయం కానీ చాలా ఆలోచించి తీసుకున్నవని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది తన సొంత పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమో.. అక్రమ ఆస్తుల సంపాదన కోసమో.. పోలీసు కేసులకు భయపడో.. హంగులు ఆర్భాటాలు ఉన్న జీవితం కోసమో కాదని తెలిపారు. తాను పుట్టి పెరిగిన సమాజం చాలా వేదనతో వెనుకబడి ఉన్నదని.. వాళ్ల కోసం చట్టసభలో ఒక గొంతుకగా బతికి, వాళ్ల జీవితాలను తన శక్తి మేరకు సమూలంగా మార్చాలనే ప్రజా జీవితంలోకి వచ్చానని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే బహుజన వాదం, తెలంగాణ వాదం రెండూ కలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని నమ్మానని అన్నారు.
గెలుపుతో వచ్చే అధికార ఫలాలను అనుభవించినప్పుడు, ఓటమితో వచ్చే కష్టాలను కూడా భరించగలిగే వాడే నిజమైన పార్టీ నాయకుడు అని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రతి దానికి భయపడే పిరికిపందలకు బీఆర్‌ఎస్ లాంటి ఉద్యమ పార్టీల్లో స్థానం ఉండకూడదని అభిప్రాయపడ్డారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అధికార పార్టీలు పోలీసు కేసులను, కట్టు కథలను, ఆయుధాలుగా వాడి రాజకీయ ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయడం నేడు మన తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు అని తెలిపారు.









