ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడేలా ఉండకూడదని, గడీలను బద్దలు కొట్టి ప్రజా పాలన తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం వాల్మీకి బోయలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాల్మీకి బోయల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సంక్షేమంలో, అభివృద్ధి, విద్యలో సముచిత స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వాల్మీకి బోయలు కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని కోరారు. వంద రోజుల్లో ఒక మంచి పరిపాలన అందించామని తెలిపారు. పరిపాలనలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. వంద రోజులు పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేసిందని, మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసామని వెల్లడించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వంపై ఉద్యోగులు విశ్వాసం కోల్పోయారన్నారు. ఉద్యోగులకు మొదటి తారీఖు జీతాలు ఇచ్చి ప్రభుత్వంపై విశ్వాసం కల్పించామని తెలిపారు.
కేటీఆర్ బరి తెగించి మాట్లాడుతున్నారు..
ఈ సందర్భంగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌తో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిందని అన్నారు. కొద్ది మందివి విన్నామని సిగ్గులేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇలా బరి తెగించి ఎవరైనా మాట్లాడుతారా? ప్రశ్నించారు. కేటీఆర్ బరి తెగించి మాట్లాడుతున్నారని, దాని ఫలితం ఆయన అనుభవిస్తారని మండిపడ్డారు. దీనిపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. ఫోన్ టాపింగ్‌కు పాల్పడిన వాళ్లు చర్లపల్లి జైలులో ఊచలు లెక్కబెడతారని చెప్పారు. బీఆర్‌ఎస్ చెప్పినట్లు చేసిన అధికారుల పరిస్థితి చూస్తున్నామని చెప్పారు. ఎవరైనా ఇతర కుటుంబ కాల్స్ వింటారా అని నిలదీశారు. 200 ఓట్లతో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ గెలవబోతున్నామని ధీమాను వ్యక్తం చేశారు. అధికార బీజేపీలో ఉన్న డీకే అరుణ ఆర్డీఎస్ ద్వారా కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చారా .. తుమ్మిళ్ల ప్రాజెక్టు పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్న అరుణమ్మ పాలమూరు రంగారెడ్డికి ఎందుకు జాతీయ హోదా తీసుకురాలేదన్నారు. ఏం ముఖం పెట్టుకుని మహబూబ్ నగర్‌లో బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.