తీహార్ జైలు అధికారుల తీరుపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. జైలు అధికారులపై కోర్టుకు ఫిర్యాదు చేశారు కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పాటించడం లేదని.. తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. తనకు మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటికి తోడు రక్తపోటు సమస్య అధికంగా ఉందన్నారు. తన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకునే న్యాయస్థానం జైలు అధికారులకు ఆదేశాలిచ్చిందన్నారు. కోర్టు ఆదేశించినా తీహార్ జైలు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత.
తనకు ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదన్నారు కవిత. ‘పరుపులు ఏర్పాటు చేయలేదు, చెప్పులు కూడా అనుమతించడం లేదు. బట్టలు, బెడ్ షీట్స్, బుక్స్, బ్లాంకెంట్స్‌ను కూడా అనుమతించడం లేదు. పెన్ను, పేపర్లను అందుబాటులో వుంచలేదు. కనీసం కళ్ళజోడు కూడా అనుమతించడం లేదు, చేతికి వున్న జప మాలను కూడా అనుమతించలేదు.’ అని కవిత ఆరోపించారు. జైలు అధికారుల నిర్వాకం పట్ల తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కవిత. తీహార్ జైలు సూపరింటిండెంట్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యలపై కవిత తరఫున న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. శనివారం విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.









