ప్రతిపక్షాలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. గతంలో చంద్రబాబు అబద్దాలు చూశామని, మోసాలు కూడా ఆయన పాలనలో చూశామని ఫైర్ అయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపు కొట్టి సంక్షేమం అందించామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నంద్యాల ఓ జన సముద్రంలా కనిపిస్తోందన్నారు. మళ్లీ నారా పాలన తెస్తామంటున్నారని, నరకాసుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారని ఎద్దేవా చేశారు. సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి మూడు పార్టీలు ఏకమయ్యాయని, వీటికి కాంగ్రెస్ పార్టీ కూడా తోడైందని కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతామన్నారు. ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పారు.
పేదలను చీకటిలోకి తీసుకు వెళ్లేందుకు పొత్తులు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. వారి కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు తామే గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. డబుల్ సెంచరీ కొడదామని, వైసీపీకి ఓటు వేస్తే మరో ఐదేళ్లు ముందుకు వెళ్తామని.. చంద్రబాబుకు ఓటు వేస్తే మరో ఐదేళ్లు వెనక్కి పోతామన్నారు. ఈ ఎన్నికలు మోసాల బాబుకు చివరి ఎన్నికలు కావాలన్నారు. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించామని అన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నామని, లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చామని, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.