ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) బోణీ కొట్టింది. రికార్డు స్కోర్‌తో చరిత్ర సృష్టించిన కమిన్స్ సేన ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను చిత్తుగా ఓడించింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. హెన్రిచ్ క్లాసెన్(80), అభిషేక్ శర్మ(63), ట్రావిస్ హెడ్(62) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. బౌలర్లు ముంబై బ్యాటర్లకు ముకుతాడు వేశారు. దాంతో, ఆరెంజ్ ఆర్మీ సొంత ఇలాకాలో భారీ విజయం సాధించింది. ముంబై ఆటగాళ్లతో తిలక్ వర్మ(64) ఒంటరి పోరాటం చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్, ఉనాద్కాత్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఉప్పల్ స్టేడియంలో బుధవారం సిక్సర్ల వర్షం కురిసింది. సొంత ప్రేక్షకుల సమక్షంలో ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్లు చితక్కొట్టగా.. స్టేడియం వెళ్లిన అభిమానులంతా బౌండరీల జడివానలో తడిసి ముద్దయ్యారు. అరంగేట్రంలోనే ఓపెనర్ ట్రావిస్ హెడ్ (62) 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి హైదరాబాద్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. హెడ్‌కు జత కలిసిన అభిషేక్ శర్మ(63) సైతం తన విధ్వంసం కొనసాగించాడు.