AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎంపీ ఎన్నికలు రెఫరెండమే.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

17 స్థానాలూ గెలిచి సోనియమ్మకు కృతజ్ఞత చెబుతాం
చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలకు సీఎం దిశానిర్దేశం

(అమ్మన్యూస్‌ ప్రతినిధి, హైదరాబాద్‌):
కాంగ్రెస్‌ పార్టీ వంద రోజుల పాలనకు లోక్‌సభ ఎన్నికలు రెఫరెండం కాబోతున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణాలో 17 పార్లమెంట్‌ స్థానాలు గెలిచి సోనియమ్మకు కృతజ్ఞత చెబుదామన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే దేశం, రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. మంగళవారం చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందని స్పష్టం చేశారు. చేవెళ్ల, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉందని.. అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్‌ రెడ్డి, మల్కాజిగిరి సునీతా మహేందర్‌ రెడ్డి, సికింద్రాబాద్‌ దానం నాగేందర్‌ ని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్‌ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారని గుర్తు చేశారు. పార్టీకి అండగా నిలబడి సోనియమ్మ నాయకత్వానికి బలపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. తుక్కుగూడ రాజీవ్‌ గాంధీ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారంటీలను ప్రకటించుకున్నాం.. మళ్లీ అక్కడే ఏప్రిల్‌ 6 లేదా 7న జాతీయస్థాయి గ్యారంటీలను ప్రకటించుకోబోతున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నామని.. ఈ జన జాతర సభకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే హాజరవుతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించునున్న ఈ సభను విజయవంతం చేయాలని రేవంత్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ANN TOP 10