లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ కార్యకలాపాలన్నింటికీ దూరంగా ఉంటున్నారు. ‘ఒకప్పుడు మేం పార్టీ నుంచి ఆయనను బహిష్కరించాం.. ఇప్పుడు ఆయన మా పార్టీని బహిష్కరించినట్టుగా కనిపిస్తున్నది’ అని నేతలు చెప్పుకొనే స్థాయిలో రాజాసింగ్ దూరంగా ఉంటున్నారు.
శనివారం కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ కన్వీనర్లు, ప్రభారీలు, మోర్చాల అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులతో సమావేశం జరిగింది. దీనికి బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ కూడా హాజరయ్యారు. కానీ, రాజాసింగ్ డుమ్మా కొట్టారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ తిరుగుబాటు చేసినట్టేనని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
బీజేపీఎల్పీ పదవి ఇవ్వకపోవడంతో అలక
వాస్తవానికి రాజాసింగ్ డిసెంబర్ నుంచే పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత పదవి ఇవ్వాలని రాజాసింగ్ కోరినా పార్టీ పెద్దలు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌లో జరిగిన ఓ సమావేశంలో మధ్యలోనే అలిగి వెళ్లిపోయి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. రాజాసింగ్ నోటి దురుసుతో అసెంబ్లీలో ఏదైనా మాట్లాడితే పరువు పోతుందనే ఉద్దేశంతో ఎల్పీ నేత పదవి ఇవ్వలేదని ప్రచారం జరిగింది.
ఈ పరిణామాలతో ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్లాలని రాజాసింగ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జహీరాబాద్ లేదా హైదరాబాద్ టికెట్ ఆశించారని తెలిసింది. ఇక్కడా ఎదురుదెబ్బ తగలడంతో పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.