లేదంటే ఇంట్లోకి రానివ్వకండి
మహిళలతో మాజీ సీఎం బాబు హాట్ కామెంట్
(అమ్మన్యూస్, హైదరాబాద్)
టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు హాట్ కామెంట్ చేశారు. టీడీపీకి ఓటేస్తేనే మగవారికి అన్నం పెట్టండని అన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో సోమవారం బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భవన్‌లో మహిళలతో బాబు ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం వస్తే చాలు రీఛార్జ్ అవుతానని.. మరోసారి ఇక్కడ తన గెలుపును రెన్యూవల్ చేయాలని కోరుతున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నాసిరకం మద్యం అమ్ముతూ.. ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచేస్తున్నారని జగన్ సర్కార్ ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో రూ.60 మద్యం ధర రూ.200 అయ్యిందని మండిపడ్డారు.
టీడీపీ అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. జే బ్రాండ్ ఎందుకు పెట్టారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కుప్పంలో రాళ్లు, మట్టిని కూడా అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది కౌరవ సభ అని.. దాన్ని గౌరవ సభ చేశాకే మళ్లీ అక్కడ అడుగుపెడతానన్నారు. అందుకోసం మీరంతా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేయాలన్నారు.