AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌.. ప్రకటించిన కేసీఆర్‌

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ (BRS) దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కన్నా ముందే ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. తాజాగా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఫైనల్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినథులను చర్చించిన తర్వాత కేసీఆర్‌ ఈ మేరకు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ అన్ని వర్గాలకు అవకాశం కల్పించారు. బీసీలకు 6 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీచేసే అవకాశాన్ని కల్పించారు. బీసీల్లోనూ మున్నూరుకాపులకు రెండు (జహీరాబాద్‌, నిజామాబాద్‌) పార్లమెంట్‌ స్థానాలు కేటాయించగా, చేవెళ్ల స్థానాన్ని ముదిరాజ్‌లకు, సికింద్రాబాద్‌ను గౌడ సామాజికవర్గానికి, భువనగిరి, హైదరాబాద్‌ స్థానాలను యాదవులకు కేటాయించారు. మహబూబ్‌నగర్‌, నల్లగొండ, మెదక్‌, మల్కాజిగిరి స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించారు. వెలమ, కమ్మ సామాజిక వర్గానికి ఒక్కో సీటును కేటాయించారు. రిజర్వ్‌ స్థానాల్లోనూ సమాన అవకాశాలు కల్పించారు. ఎస్టీల్లో ఆదివాసీ, మైదాన గిరిజనులకు సమానంగా సీట్లు ఇచ్చారు.

ఆదిలాబాద్‌ స్థానాన్ని ఆదివాసీ (గోండు) గిరిజనులకు కేటాయించగా, మహబూబాబాద్‌ స్థానాన్ని మైదాన ప్రాంత గిరిజన (బంజారా/లంబాడా) గిరిజనులకు కేటాయించటం విశేషం. ఎస్సీ నియోజకవర్గాల్లో రెండు స్థానాలను మాదిగ (నాగర్‌కర్నూల్‌, వరంగల్‌)లకు, పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించారు.

ANN TOP 10