AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు చంద్రగ్రహణం ఉందా, లేదా?… చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్ ఏమన్నారంటే…!

నేడు (మార్చి 25) చంద్రగ్రహణం అంటూ జరుగుతున్న ప్రచారంపై చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సీఎస్ రంగరాజన్ స్పందించారు. చిలుకూరు ఆలయానికి వస్తున్న భక్తులు ఈ ఉదయం నుంచి చంద్రగ్రహణం గురించే మాట్లాడుతున్నారని తెలిపారు. 100 మంది భక్తుల్లో 50 మంది “రేపు చంద్రగ్రహణం ఉందట కదా పంతులు గారూ, నేడు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి” అని అడుగుతున్నారని వెల్లడించారు.

భక్తులందరికీ ఒకటే చెబుతున్నా… నేడు మనకు చంద్ర గ్రహణం లేదు అని రంగరాజన్ స్పష్టం చేశారు. దీని వల్ల మనం భయపడాల్సిందేమీ లేదని, నేడు చంద్రగ్రహణం అమెరికా, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుందని వివరించారు. అది కూడా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది, ఆ సమయంలో మనకు చంద్రుడు కనిపిస్తాడా? ఏం ప్రశ్నలండీ ఇవి? అని అన్నారు.

“హోలీ రోజున గ్రహణం పడుతుంది కదా… ఏవైనా ఇబ్బందులు వస్తాయా? గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఆలయం మూసివేస్తారా? అంటూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవన్నీ విన్నప్పుడు ఎవరు ఇలాంటి అపోహలు సృష్టిస్తారని ఆశ్చర్యం కలుగుతుంది. యూట్యూబ్ చానల్స్ వాళ్లు సంయమనం పాటించాలి. ఉన్న భయాలతోనే భక్తులు చస్తున్నారు… దయచేసి కొత్త కొత్త భయాలు సృష్టించకండి.

ఏవైనా గ్రహణాలు సంభవించేట్టయితే పదిహేను రోజుల ముందు నుంచే మేం ప్రకటనలు చేస్తుంటాం. ఫలానా రోజు గ్రహణం వస్తుంది… ఆ రోజు దేవాలయం మూసివేస్తాం… ఆలయ మూసివేత సమయాలు ఇలా ఉంటాయి అని మేం ప్రకటిస్తుంటాం. మరొక్కసారి చెబుతున్నా… నేడు మనకు చంద్ర గ్రహణం లేదు కాక లేదు… భక్తులందరూ సంతోషంగా హోలీ పండుగ జరుపుకోండి” అని రంగరాజన్ ఓ వీడియోలో వివరించారు.

ANN TOP 10