ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. చివరి వరకు ఉత్కంఠపరంగా సాగిన పోరులో ముంబై ఇండియన్స్‌పై 6 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ 169 లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులకే చేతులేత్తేసింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ తొలి విజయాన్ని అందుకుంది.
సాయి దర్శన్ టాప్ స్కోరు :
ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. వృద్ధిమాన్ సాహా, శుభ్‌మాన్ గిల్ మంచి ఆరంభాన్ని అందించారు. ఇక, సాయి సుదర్శన్ (45), శుభమాన్ గిల్ (31) అద్భుతంగా రాణించారు. ముంబై బౌలర్లు త్వరితగతిన వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య జట్టు స్వేచ్ఛగా స్కోర్ చేయలేకపోయింది.
మిగత ఆటగాళ్లలో వృద్ధిమాన్ సాహా (19), అజ్మతుల్లా ఒమర్జాయ్ (17), డేవిడ్ మిల్లర్ (12), విజయ్ శంకర్ (6), రాహుల్ తెవాటియా (22), రషీద్ ఖాన్ (4) పేలవ ప్రదర్శనతో తక్కువ పరుగులకే పరిమితమయ్యారు. పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా కేవలం 12 పరుగులిచ్చి 4 ఓవర్లలో వికెట్లు తీశాడు. అరంగేట్రం ఆటగాడు గెరాల్డ్ కోయెట్జీ ఇద్దరు బ్యాటర్లను అవుట్ చేసి 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చాడు.
రాణించిన రోహిత్, బ్రెవిస్ :
గుజరాత్ నిర్దేశించిన 169 లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ (43, 29 బంతులు), డెవాల్డ్ బ్రెవిస్ (46, 38 బంతుల్లో) రాణించారు. అయినప్పటికీ ముంబైని విజయతీరాలకు చేర్చడంలో విఫలమయ్యారు. ముంబై మిగతా ఆటగాళ్లలో నమన్ ధీర్ (20), తిలక్ వర్మ (25), టిమ్ డేవిడ్ (11), హార్దిక్ పాండ్యా (11), గెరాల్డ్ కోయెట్జీ (1), షామ్స్ ములానీ (1), జస్ప్రీత్ బుమ్రా (1) పరుగులు చేయగా, పీయూష్ చావ్లా, ఇషాన్ కిషన్ ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరారు.