AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వార్తల పేరుతో శుద్ధ అబద్దాలు.. యూట్యూబ్‌ ఛానెళ్లపై కేటీఆర్ ఫైర్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్ నెయిల్స్ పెడుతున్నారని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తల పేరుతో శుద్ధ అబద్దాలను చూపిస్తున్నాయని, గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడున్నారని, ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్‌లను ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇది వ్యక్తిగతంగా తనతో పాటు పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నామన్నారు. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా పేర్కొన్నారు.

గతంలో తమపై అసత్య ప్రచారాలను అవాస్తవాలను ప్రసారం చేసినా, మీడియా సంస్థలపై కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గం పూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి అడ్డమైన తంబునెల్స్ తో వార్తల పేరిట ప్రాపగండకు పాల్పడుతున్నారని, ఆ యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం కేసులు నమోదు చేస్తామన్నారు. అదే విధంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పాటు ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్‌కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తామని, ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

ANN TOP 10