హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంపై విచారణ స్పీడందుకుంది. మాజీ అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao), ఓ న్యూస్ చానెల్ ఎండీ శ్రవణ్‌పై (Sravan) విచారణ అధికారులు దృష్టిసారించారు. వారిద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. ఇప్పటికే ప్రభాకర్ రావు (Prabhakar Rao), శ్రవణ్ (Sravan) విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న వారిని స్వదేశం రప్పించేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని విచారణ అధికారులు స్పష్టం చేశారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ నివాసాల్లో పంజాగుట్ట పోలీసులు సోదాలు నిర్వహించారు. శ్రవణ్ నివాసంలో లాప్ ట్యాప్, పెన్ డ్రెవ్, ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అదనపు ఎస్పీలను అరెస్ట్ చేశారు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆ ఇద్దరు ఎస్పీలు అంగీకరించారని వివరించారు. ఇద్దరు అధికారులను మేజిస్ట్రేట్ నివాసంలో పోలీసులు హాజరు పరిచారు.
