నాలుగు ఎంపీ స్థానాలు గెలిచేలా ప్లాన్
ఇప్పటికే హస్తం గూటికి చేరిన బీఆర్‌ఎస్ కీలక నేతలు
త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
మరో 20 మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు సైతం అదే దారిలో..
(అమ్మన్యూస్ ప్రతినిధి, హైదరాబాద్):
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేశారు. బల్దియా పీఠాన్ని దక్కించుకోవడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకునేలా స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసయుద్దిన్, ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం గూటికి చేరారు. తాజాగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరనున్నారు. అంతేకాదు ఆమెతో పాటు మరో 20 మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
సీఎం రేవంత్ సమక్షంలో చేరేందుకు రెడీ..
త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారంతా హస్తం తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, గ్రేటర్ హైదరాబాద్‌పై కన్నేసిన కాంగ్రెస్.. వరుసగా చేరికలను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం వారితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ భేటీ అయ్యారు. కేశవరావు నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సుమారు 40 నిమిషాల పాటు కేకే, విజయలక్ష్మిలతో చర్చలు జరిపిన దీపాదాస్ మున్షీ.. వారిని కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరితే ఇచ్చే పదవి, ఇతర అంశాలకు సంబంధించి కేకే పలు ప్రతిపాదనలు దీపాదాస్ మున్షీ ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. కేకే పెట్టిన ప్రతిపాదనలపైన పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్న అధిష్టానం.. మేయర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఆకర్ష్ ఒక్కటి.. లాభాలు రెండు..
గ్రేటర్ పరిధిలో ఆపరేషన్ ఆకర్ష్‌తో రెండు లాభాలను ఎక్స్ పెక్ట్ చేస్తోంది కాంగ్రెస్. గ్రేటర్ పరిధిలోని లోక్‌సభ సీట్లను గెలవడంతో పాటు.. రాబోయే రోజుల్లో బల్దియా పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే చేరికలను వేగిరం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల పరంగా బీఆర్‌ఎస్ బలంగా ఉందని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 39 స్థానాలు గెలిస్తే.. అందులో 16 స్థానాలు గ్రేటర్ హైదరాబాద్‌లోనివే ఉన్నాయి. ఇక గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌కు 56 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎంఐఎంకు 44 కార్పొరేటర్లు ఉంటే అందులో ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. బీజేపీకి 48, కాంగ్రెస్‌కు ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు ఉన్న 55మంది కార్పొరేటర్లలో 13మంది ఇప్పటికే హస్తం గూటికి చేరారు. ఇక గులాబీ పార్టీకి మిగిలిన 43 మంది కార్పొరేటర్లలో మేయర్‌తో సహా మరో 20మంది వరకు త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఖతర్నాక్ వ్యూహం..
అయితే ఇప్పటికిప్పుడు జీహెచ్‌ఎంసీ పీఠాన్ని సొంతం చేసుకోవాలంటే మరింత మంది చేరాల్సి ఉంటుంది. ఒకవేళ కార్పొరేటర్లు పెద్దఎత్తున కాంగ్రెస్‌లో చేరినా ఇప్పటికిప్పుడు బీఆర్‌ఎస్ మేయర్‌పై అవిశ్వాసం పెట్టడానికి వీళ్లేదు. మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలంటే నాలుగేళ్ల సమయం పూర్తి కావాల్సి ఉంటుంది. అప్పటివరకు అవిశ్వాసం పెట్టేందుకు మున్సిపల్ యాక్ట్ ఒప్పుకోదు. దాంతో మేయర్ నే తమ పార్టీలో చేర్చుకుంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే మేయర్ గద్వాల విజయలక్ష్మీతో కాంగ్రెస్ నేలు చర్చలు జరిపినట్లు సమాచారం.