AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పార్టీ మారే వాళ్లను చెప్పుతో కొట్టిస్తాం: ఎమ్మెల్యే పల్లా

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో అకాల వర్షంతో పంట తీవ్రత ఎక్కువగా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంచనా కూడా వేయలేదన్నారు. కనీసం పంట నష్టపోయిన రైతులను కూడా పరామర్శించే లేదని విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా తుమ్మలకు 40 ఏళ్ల అనుభవం ఉండి కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం పంట నష్టం అంచనా వేయలేదని తమపై బురద జల్లుతున్నారని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అకాల వర్షాలకు పంట నష్టం జరిగితే బోనకల్లు వెళ్లి పంట నష్టాన్ని పరిశీలించామని, అలాగే నష్ట పోయిన రైతులకు కొత్త జీవో తెచ్చి 10,000 రూపాయలు ఎకరాకు ఇచ్చామని గుర్తు చేశారు. ఆనాడు మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు పంట నష్టం జరిగితే మేమే స్వయంగా వెళ్లి పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. అప్పుడు పంట నష్ట పోయిన రైతులకు డబ్బులు రిలీజ్ చేస్తే కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని, రైతుల అకౌంట్లో డబ్బులు వేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. వారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

పార్టీ మారే వాళ్లను చెప్పులతో కొడతారు..

రైతు బంధు కింద కేసీఆర్ ప్రభుత్వం 7500 కోట్లు రూపాయలు సిద్ధం చేస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని, రైతుల అకౌంట్స్ లో పడకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆ డబ్బులు ఎవరు వాడుకున్నారో తెలుసని, వాళ్ళు రాష్ట్ర మంత్రి వర్గం లోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. 16,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన డబ్బులు ఎక్కడకి పోయాయని ప్రశ్నించారు. ఇంత వరకు రైతు బంధు అందరికీ పడలేదన్నారు. మంత్రి కాకున్నా, ఎమ్మెల్యే కాకున్నా తుమ్మల నాగేశ్వరరావుని కేసీఆర్ హెలికాప్టర్‌లో ఎక్కించుకొని బోనకల్లు తీసుకోని వెళ్ళింది నిజమా కాదా అని ప్రశ్నించారు. 56 లక్షలకు పైగా ఎకరాలకు నీరు ఇచ్చి పంటలు పండించిన ఘనత కేసీఆర్ దన్నారు. రైతులను ముంచకుండా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొనుగోలు చెయ్యాలన్నారు. ఎన్నికల సమయంలో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, చిత్తశుద్ది ఉంటే ఏంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి వెళ్తున్న నేతలను ప్రజలే ఛీ కొడుతున్నారని, చెప్పులతో కొడుతరని అన్నారు. అక్రమాల నుండి తప్పించుకునేందుకే అధికార పార్టీలోకి వెళ్తున్నారని అన్నారు. వారి అక్రమాలను బీఆర్ఎస్ పార్టీయే బయట పెడుతుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

ANN TOP 10