తెలంగాణలో ప్రస్తుతం.. హైదరాబాద్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుతో పాటు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమనాశ్రయాలు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ వరంగల్ జిల్లాలోని మామునూరులోని విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించటమే కాకుండా.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే.. ఎయిర్ పోర్ట్ విస్తరణకు 256 ఎకరాలు అవసరముండగా.. అందుకోసం పరిపాలనా అనుమతులు ఇస్తూ.. 205 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. అంతేకాదు.. నవంబర్ 19వ తేదీన ఎయిర్ పోర్టు పనులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు గ్రీన్ ఫీల్ట్ ఎయిర్ పోర్టులు కూడా రానున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.
సోమవారం (నవంబర్ 18న) రోజున సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్టుకు ఎన్ఓసీ సాధించామని.. దీంతో వరంగల్ ప్రజల కల నెరవేరబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ విమానాశ్రయాన్ని 8 నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామన్నారు. 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఎయిర్ పోర్టు కోసం ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిందన్నారు. పాత ఒప్పందం రద్దుకు జీఎంఆర్ సంస్థను ఎంతో కష్టపడి ఒప్పించామని మంత్రి తెలిపారు.
డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని కలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు. ప్రతిపాదనలో ఉన్న మిగతా నాలుగు విమానాశ్రయాలను కూడా ఈ నాలుగేళ్లలో తప్పకుండా సాధిస్తామని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు సాధిస్తామని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ హైవే ఆరు లైన్ల రోడ్డు పనులను జనవరిలో ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. శ్రీశైలం క్షేత్రానికి రూ.7 వేల కోట్ల ప్రాజెక్టును సాధించనున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శ్రీశైలానికి రిజర్వ్ ఫారెస్ట్ గుండా 62 కిలోమీటర్ల మేర సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ ప్రాజెక్టు సాకారమవుతోందని చెప్పుకొచ్చారు.