కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ)పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సీఏఏపై స్టే ఇవ్వబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీఏఏ అమలుపై స్టే విధించాలంటూ కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈ నెల 12న కోర్టును ఆశ్రయించింది. మరో వైపు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు నేతలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. 2019 నుంచి ఇప్పటివరకు పిటిషన్లు దాఖలు అయ్యాయి. సీఏఏపై 230 పిటిషన్లు దాఖలు కాగా.. మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన జస్టిస్ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. దీంతో సుప్రీం స్టే విధించకపోవడంతో సీఏఏ అమలు కొనసాగనుంది. అదే విధంగా పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
