బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆమెను మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ నిన్న (శుక్రవారం) ఈడీ అరెస్టు చేయగా.. ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. శుక్రవారం హైదరాబాద్లో అరెస్టు చేశాక ఢిల్లీ తరలించిన ఈడీ అధికారులు ఉదయం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించాక కోర్టులో హాజరుపరిచారు. కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో సమగ్రంగా విచారించాల్సి ఉన్నందున 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ క్రమంలోనే వారం రోజుల కస్టడీకి ఇచ్చింది. అలాగే ఈ నెల 23న తిరిగి తమ ఎదుట హాజరు పర్చాలని న్యాయమూర్తి నాగపాల్ ఆదేశించారు. మార్చి 23న మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. అదే విధంగా ప్రతిరోజూ లాయర్లు, కుటుంబ సభ్యులు ఆమెను కలిసేందుకు వీలు కల్పించింది.
ఈడీ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
కవిత ఈడీ రిమాండ్లో కీలక అంశాలు ఉన్నాయి. లిక్కర్ కేసు కీలక సూత్రధారుల్లో ఎమ్మెల్సీ కవిత పేరును కూడా రిమాండ్లో అధికారులు పేర్కొన్నారు. మాగుంట రాఘవ, శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రతో కలిసి సౌంత్ సిండికేట్ ఏర్పాటు చేసినట్లు ప్రస్తవించారు. ఆప్ నేతలతో కుమ్మక్కై రూ. 100 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. లిక్కర్ పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించినట్లు ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఎంపీ మాగుంట ద్వారా రూ. 30 కోట్లు ఢిల్లీకి కవిత చేర్చింది. రూ. 30 కోట్లను అభిషేక్ బోయిన్ పల్లి ఢిల్లీకి తీసుకు వెళ్లినట్లు బయపడింది. రామచంద్ర పిళ్లై ఆమె బినామీగా ఉన్నారు. అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి.. ఇండోస్పీరిట్ కంపెనీలో కవిత వాటా పొందారు. స్టేట్మెంట్ రికార్డు సమయంలో కవిత ఈడీకి అసంబద్ధ సమాధానాలు ఇచ్చారని, అదే విధంగా సాక్ష్యాలను కూడా ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది.









