బీఎస్పీకి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. కొత్తదారి ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందంటూ ట్వీట్ చేశారు. ‘పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీఎస్పీ- బీఆరెస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది.
బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను’ అని ఆయన పోస్ట్ చేశారు. తనకు రాజీనామా తప్ప మరో మార్గం కనిపించడం లేదని చెప్పారు.
లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. బీఎస్పీ రెండు సీట్లలో పోటీ చేస్తుందని కూడా ప్రకటించారు. ఇంతలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేయడం గమనార్హం. ఆయన బీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో భేటీ అయినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగాల్సిన వేళ బీఎస్పీ అధినేత్రికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాక్ ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.









