ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు తెరమీదకు వచ్చిన ఏడాదిన్నర తరువాత కవిత అరెస్ట్ అయ్యారు. సౌత్ గ్రూప్ సభ్యుల్లో కవితదే చివరి అరెస్ట్. అరెస్టయిన వారు ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా పలుమార్లు నోటీసులు ఇచ్చి విచారించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కవిత ఇంట్లో రైడ్స్ చేసి ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. హైదరాబాద్ విమానాశ్రయంలో రాత్రి 8.45 గంటలకు ఆమెను విమానంలో ఢిల్లీకి ఈడీ అధికారులు తరలించారు. రాత్రి 11.30 గంటలకు కవిత ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీంతో ఆమెను అక్కడి నుంచి ఈడీ అధికారులు ప్రత్యేక కారులో ఎన్ ఫోర్స్ మెంట్ ప్రధాన కార్యాలయంకు తరలించారు. రెగ్యూలర్ రూట్ లో కాకుండా వేరే మార్గంలో కవితను తరలించారు. అప్పటికే కార్యాలయం వద్దకు వైద్య బృదం చేరుకోవటంతో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కవిత రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ కుమార్, న్యాయవాది మొహిత్ రావు ఉన్నారు.
ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు.. భారీగా పోలీసులను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయంకు వెళ్లే మూడు మార్గాల్లో రెండింటిని మూసివేశారు. బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. కవితను ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపర్చనున్నారు. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసు దర్యాప్తుకోసం నాగ్ పాల్ బెంచ్ ముందు హాజరుపర్చనున్నారు. కవితను ఈడీ అధికారులు కస్టడీకి కోరనున్నారు.









