తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. పదిరోజుల వ్యవధిలోనే మరోసారి తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ.. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రాష్ట్రానికి విచ్చేసిన మోదీకి బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.ఇటీవల మరికొంతమంది బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం సాయంత్రం కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రధాని మోడీ.
అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో మల్కాజిగిరి చేరుకున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ మోడీ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌సహా పలువరు బీజేపీ నేతలు పాల్గొన్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర సాగిన భారీ ర్యాలీలో భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అశేష జనవాహినితో రోడ్లన్నీ కాషాయమయంగా మారాయి. ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోడీ ముందుకు కదిలారు. ర్యాలీ ఆధ్యాంతం మోడీ నామజపంతో మల్కాజిగిరి మార్మోగింది.కాగా, రోడ్‌షో అనంతరం రాజ్‌భవన్‌కు ప్రధాని పయనమయ్యారు. ఇక, శనివారం నాగర్‌కర్నూల్‌లో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభ నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్గొండ పార్లమెంట్స్థానాలు లక్ష్యంగా జరగనుంది. అలాగే మార్చి 18న ప్రధాని మోడీ జగిత్యాల బహిరంగ సభలో పాల్గొంటారు. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి ఎంపీ స్థానాలే లక్ష్యంగా ఈ సభకు రూపకల్పన చేశారు.









