AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరలో పార్శిళ్లు ఇంటి వద్దనే పికప్: ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌

హైదరాబాద్‌ : ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్‌(Logistics counter) విభాగ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు త్వరలోనే పార్శిళ్లను ఇంటి వద్దనే పికప్, డెలివరీ చేస్తామని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌(Dilsukh Nagar) బస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్‌ మోడల్‌ కౌంటర్‌ను ప్రారంభించారు. కొత్త కౌంటర్‌ లో ఒక పార్శిల్‌ ను బుకింగ్‌ చేసి రశీదును వినియోగదారుడు శివ కుమార్‌కు ఆయన అందజేశారు. అనంతరం లాజిస్టిక్స్ విభాగ కొత్త లోగో, బ్రోచర్ ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. పార్శిళ్ల హోం పికప్‌, డెలివరీ కోసం వినియోగించే కొత్త వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం తెలంగాణలో అతివేగంగా పార్శిళ్లను డెలివరీ చేసే వ్యవస్థ అని అన్నారు. ప్రతి రోజు సగటున 15 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తున్నామని తెలిపారు. ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించిన సంస్థ.. ప్రైవేట్‌ మార్కెట్‌కు ధీటుగా లాజిస్టిక్స్‌ విభాగాన్ని బలోపేతం చేస్తున్నదని తెలిపారు. లాజిస్టిక్స్‌ సేవలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040-69440069 గానీ, https://www.tsrtclogistics.in వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించవచ్చని సూచించారు.

ANN TOP 10