హనుమకొండలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నించిన ఆరూరిని బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచి తరలించటం ఉద్రిక్తతలకు దారి తీసింది. వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తూ బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఆరూరి.. ఇప్పటికే ఆ పార్టీతో సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు హనుమకొండలోని తన నివాసంలో ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టారు. అయితే సరిగ్గా అదే సమయంలో బీఆర్‌ఎస్ నేతల ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.
బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఇతర నేతలు బుధవారం ఉదయం ప్రశాంత్‌నగర్‌లోని ఆరూరి ఇంటికి వెళ్లారు. ప్రెస్‌మీట్‌లో పాల్గొననీయకుండా ఆరూరిని అడ్డుకున్నారు. హరీష్‌రావు పంపిస్తే తాము వచ్చామని చెబుతూ.. ఆయనతో ఫోన్‌లో కూడా మాట్లాడించారు. కోరింది ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆరూరికి సర్దిచెప్పే యత్నం చేశారు. తమ వెంట రావాలని ఆరూరిని కోరారు. అనంతరం ఆరూరి రమేష్‌ను ఎర్రబెల్లి దయాకర్, బస్వరాజు సారయ్య తమతో తీసుకెళ్తున్న సమయంలో వారిని ఆరూరి అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు. మరోవైపు ఏం చేయాలో పాలుపోక ఆరూరి రమేష్ అయోమయ పరిస్థితిలో పడ్డారు.
వెనక్కి తగ్గొద్దని, బీఆర్ఎస్ నేతల మాటలు వినొద్దని ఆరూరి అనుచరులు ఆయన కాళ్ల మీద పడ్డారు. ఆరూరిని తీసుకెళ్తుండగా.. ఆయన్ని తీసుకెళ్లవద్దని కొంత మంది అనుచరులు ఎర్రబెల్లి దయాకర్ రావు కాళ్ల మీద కూడా పడి వేడుకున్నారు. ఈ గందరగోళ పరిస్థితి మధ్య మొత్తానికి ఎర్రబెల్లి దయాకర్ రావు తన కారులో ఆరూరిని ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఎర్రబెల్లి కారును ముందుకు వెళ్లనివ్వకుండా ఆరూరి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ చాలాసేపు హైడ్రామా నడిచింది. మొత్తానికి కొంత మంది బీఆర్ఎస్ నేతల సహకారంతో కారును ముందుకు పోనిచ్చారు.