కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన అభిమానుల కోసం బుధవారం లేఖ రాశారు. తానొక్కడినే వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని, తన వెంట ఎవరూ రావొద్దని కోరారు. సెక్యూరిటీ ఇబ్బందుల దృష్ట్యా తన వెంట ఎవరూ తాడేపల్లికి రావద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అభిమానులకు అసౌకర్యం కలగకూదనే ఉద్దేశంతోనే రావొద్దని చెబుతున్నానని, ఇందుకు తనను క్షమించాలని లేఖలో వేడుకున్నారు.
కాగా, ఈనెల 15 లేదా 16 తేదీల్లో ముద్రగడ పద్మనాభం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.