AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భూమి, ఆకాశం ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటది .. కేసీఆర్

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండి మాట్లాడే భాష అదేనా? తాను ఉద్యమం సమయంలో మినహా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాంటి పరుషపదాలు ఉపయోగించలేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన కదనభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… కరీంనగర్ పోరాటాల గడ్డ అని… ఈ గడ్డ నుంచే మనం పోరాటం ప్రారంభించామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దనే ఆంక్షలు ఉండేవన్నారు. తాను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడానన్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మానవబాంబులం అవుతామని అనవచ్చునా? అని నిలదీశారు. తమకు తిట్లు రాక కాదని… మాట్లాడాలనుకుంటే రేపు ఈ సమయం వరకు మాట్లాడుతానని అన్నారు. తాను కూడా ఇలాంటి మాటలు ఉద్యమం సమయంలో మాత్రమే మాట్లాడానని… ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లు మాత్రం అలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. మీకు ప్రజలు అవకాశమిచ్చారని… మాకంటే కాస్త మంచిగా చేసే ప్రయత్నం చేయాలని సూచించారు. అంతేకానీ పండబెట్టి తొక్కుతామనే మాటలు ఎందుకు? అని ప్రశ్నించారు. తాము 24 గంటలు విద్యుత్ ఇచ్చామన్నారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించి కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. జిల్లాకో నవోదయ పాఠశాలను ఇవ్వని… తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. ఎంపీ బండి సంజయ్ ఇక్కడ ఐదు రూపాయల పని చేశారా? అని నిలదీశారు. బండి సంజయ్‌కి, వినోద్ కుమార్‌కు పోలిక ఉన్నదా? కరీంనగర్ ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఉద్యమం సమయం నుంచి తన వెంటే నిలుస్తున్నారని వినోద్ కుమార్‌పై ప్రశంసలు కురిపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు వచ్చాయన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిపోయాయని… చిల్లర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బలమే తెలంగాణ బలం… బీఆర్ఎస్ గళమే… తెలంగాణ గళమన్నారు. తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాల్సిందే అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయన్నారు. రైతుబంధును తీసుకువచ్చిందే బీఆర్ఎస్ అన్నారు. తమ హయాంలో 24 గంటల విద్యుత్ ఇచ్చామని, నీళ్లు ఇచ్చామని దీంతో పంటలు బాగా పండాయన్నారు. కానీ ఇప్పుడు మార్చి నెలలోనే పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు.

భూమి, ఆకాశం ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బీఆర్ఎస్ పని అయిపోయిందని కొన్ని బేవార్స్ ఛానల్స్ అంటున్నాయని… కానీ మీరే మా వద్దకు వచ్చి.. మళ్లీ సలాంలు కొడతారన్నారు. ఎవరో ఒకరిద్దరు మన పార్టీ నుంచి పోతే భయపడేది లేదని… పార్టీని వీడుతున్న వారిని ఉద్దేశించి అన్నారు.

ANN TOP 10