AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏడుపాయలలో వనదుర్గామాత రథోత్సవం

పాపన్నపేట: ఏడుపాయల జాతరలో చివరి అంకమైన రథోత్సవం ఆదివారం రాత్రి ఉత్సాహంగా సాగింది. ఏడుపాయల ధర్మకర్త రాగి చక్రపాణి తయారు చేయించిన కొత్త రథాన్ని రంగుల పూలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆనవాయితీ ప్రకారం ఆలయ కమిటీ చైర్మన్‌ బాలాగౌడ్‌, ఈవో మోహన్‌రెడ్డి నాగ్సాన్‌పల్లి గ్రామానికి చెందిన సాయిరెడ్డి ఇంటికి వెళ్లి రథోత్సవానికి ఆహ్వానం పలికారు. నాగ్సాన్‌పల్లికి చెందిన 18 రకాల వృత్తుల వారు ఏడుపాయలకు వచ్చి, రథం ఎదుట పెద్దపట్నం వేసి అన్నాన్ని రాశిగాపోసి గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం వేద పండితులు గర్భగుడిలో నుంచి వనదుర్గమ్మ ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజల అనంతరం పల్లకీలో రథం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన భక్తులు వనదుర్గామాత నామస్మరణ చేస్తూ రథాన్ని ముందుకు లాగారు. దుర్గమ్మ నామస్మరణతో ఏడుపాయలు ప్రతిధ్వనించాయి.

పోటెత్తిన భక్తజనం
జాతర రథోత్సవం, ఆదివారం కలిసిరావడంతో ఏడుపాయల క్షేత్రం కిటకిటలాడింది. లక్షకు పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి గంటల తరబడి భక్తులు క్యూలైన్లలో వేచిఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. రోజంతా అమ్మవారికి మొక్కులు చెల్లించే భక్తుల బోనాల ఊరేగింపులు, శివసత్తుల పూనకాలు, ఒడిబియ్యం, తలనీలాల సమర్పణతో సందడిగా సాగింది.

ANN TOP 10