రోడ్డుపైనే నిరీక్షణ
రఘురామను తీసుకెళ్లని బాబు, పవన్‌కల్యాణ్
అమిత్‌షా నివాసంలోకి రఘురామకు ఎంట్రీ లేకపోవడంతో రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. ఈ ఘటన హస్తినలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని టీడీపీ, జనసేన నిర్ణయించిన నేపథ్యంలో హస్తినలో పార్టీ పెద్దలతో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. చర్చలు కొలిక్కి రాకపోవడంతో శనివారం కూడా కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం కావాలని నిర్ణయించారు.
అమిత్ షా శనివారం బీహార్ రాజధాని పాట్నా వెళ్లనుండగా.. ఆ పర్యటనకు ముందు కలిసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ఆయన అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరు అమిత్‌షాలో నివాసంలోకి వెళ్లారు. వీరి వెంట ఉన్న రఘురామ కృష్ణంరాజుకు ఎంట్రీ లేకపోవడంతో గేటు బయటే వేచి ఉన్నారు. రోడ్డు మీద ఉండి తనను అనుమతించాలని ఫోన్లు చేస్తున్నా లోపలి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం గమనార్హం. రఘురామను చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ వెంట తీసుకెళ్లకపోవడం కొసమెరుపు. మరి పోత్తులపై వీరి మధ్య జరిగే చర్చలు ఏ మేరకు ఫలప్రదమవుతాయో వేచి చూడాల్సిందే.