ప్రధాని మోదీ మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. తొలిసారి కజిరంగ నేషనల్ పార్క్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.. ఏనుగుపై ఊరేగారు. నేషనల్ పార్క్‌లో ఏనుగుపై సవారీ చేసిన మోదీకి.. అక్కడి సిబ్బంది విశేషాలు వివరించారు. ఇక శుక్రవారం రాత్రి కజిరంగ నేషనల్ పార్కుకు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడే బస చేశారు. అనంతరం శనివారం తెల్లవారుజామునే పార్కు మొత్తం సందర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి సాహసాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ చేస్తున్న పనులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. లక్షద్వీప్‌లో స్నార్కెలింగ్.. ఆ తర్వాత సముద్రంలో మునిగిన ద్వారకకు స్కూబా డైవింగ్ చేసి మరీ వెళ్లి పూజలు చేయడం.. ఇలా రకరకాల విన్యాసాలు చేసి దేశ ప్రజలను అబ్బురపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అస్సాంలోని కజిరంగ నేషనల్ పార్క్‌ను తొలిసారి పర్యటించిన ప్రధాని మోదీ.. ఏనుగుపై సవారీ చేశారు. ప్రధాని మోదీ ఏనుగుపై సవారీ చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
1957 తర్వాత ఒక ప్రధాని అస్సాంలోని కజిరంగ నేషనల్ పార్క్‌ను సందర్శించడం గమనార్హం. అది ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్‌ను సందర్శించిన ప్రధాని.. ఏనుగు ఎక్కి అందులో పర్యటించారు. రెండు రోజుల అస్సాం పర్యటన సందర్భంగా శుక్రవారం సాయంత్రం తేజ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి.. ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక చాపర్‌లో గోలాఘాట్ జిల్లాలోని కజిరంగ నేషనల్ పార్క్‌కు ప్రధాని చేరుకున్నారు.