టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో రోజూ పూర్తి ఆధిపత్యాన్ని టీమిండియా ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్‌ను 218 పరుగులకు కట్టడిచేసింది. భారత సారథి రోహిత్ శర్మ (162 బంతుల్లో 103, 13 ఫోర్లు, 3 సిక్సర్లు)కు తోడు శుభ్‌మన్ గిల్ (150 బంతుల్లో 110, 12 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకాలతో మెరిశారు. వీళ్లతో పాటు తొలి టెస్టు ఆడుతున్న దేవ్‌దత్ పడిక్కల్ (103 బంతుల్లో 65, 10 ఫోర్లు, 1 సిక్సర్), సర్ఫరాజ్ ఖాన్ (60 బంతుల్లో 56, 8 ఫోర్లు, 1 సిక్స్) లు అర్థ సెంచరీలతో రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది.
ఇందులో దేవ్‌దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్‌లు అద్భుతంగా రాణించారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 97 పరుగులు జతచేశారు. అర్థ సెంచరీ చేశాక సర్ఫరాజ్ ఖాన్‌ను బషీర్ ఔట్ చేయగా పడిక్కల్ కూడా అతడి బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. రవీంద్ర జడేజా (15), ధృవ్ జురెల్ (15), అశ్విన్ (0)లు విఫలమయ్యారు. ఆ తర్వాత 9, 10 స్థానాల్లో వచ్చిన కుల్‌దీప్ యాదవ్ 27, జస్ప్రిత్ బుమ్రా 19 పరుగులతో అజేయంగా 45 పరుగులు జోడించి పర్వాలేదనిపించారు. దీంతో టీమిండియా 225 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. అలాగే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్గాండ్‌ను 218 పరుగులకు కట్టడి చేసింది టీమిండియా. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ నాలుగు వికెట్లుతో సత్తాచాటగా.. టామ్ హర్ట్లీ రెండు వికెట్లు పడగొట్టాడు.