లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై తేల్చండి
మహారాష్ట్ర బీఆర్‌ఎస్ నేతల అల్టిమేటం
(అమ్మన్యూస్ ప్రతినిధి, హైదరాబాద్)
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌షాక్.. ఈసారి మహారాష్ట్ర బీఆర్‌ఎస్ నేతలు ఏకంగా అల్టిమేటం జారీ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై వారం రోజుల్లో తేల్చాలని స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లోనే ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ గెలుపు కోసం ఇప్పటి నుంచే పథకాలు రచిస్తున్నాయి.
ముఖ్యంగా పార్టీల అధినేతలు తమ అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసుకుని పోటీలో దింపేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలన్న కాంక్షతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మహారాష్ట్రలోని పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలను పార్టీలో చేర్చుకున్నారు.
అయితే, ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు రావడంతో బీఆర్‌ఎస్ నేతలు డైలమాలో పడిపోయారు. అసలు బీఆర్‌ఎస్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదా అన్న సందిగ్ధంలో ఉన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మహారాష్ట్రలో పార్టీ నియమించిన ఆరుగురు కో-ఆర్డినేటర్లు సమావేశమయ్యారు. ఈ అంశంపై వెంటనే తేల్చాలంటూ మహారాష్ట్ర నేతలు కేసీఆర్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందో లేదో అన్న అంశంపై మరో వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలని లేఖ రాశారు.