చంద్రునిపై అన్వేషణలో మరో కీలక ముందడుగు పడింది. మనిషి శాశ్వత నివాస కలను వీలైనంత త్వరగా సాకారం చేయాలని రష్యా, చైనాలు భావిస్తున్నాయి. అందుకు అవసరమైన విద్యుత్ తయారీని సోలార్ ప్యానళ్లు తీర్చలేకపోవచ్చనే ఉద్దేశంతో ఏకంగా అణు విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాయి. అందుకోసం ఇప్పటికే సంయుక్త కార్యాచరణను ప్రారంభించాయి. ఈ నిర్మాణాన్ని 2033 నుంచి 2035లోపు పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇప్పటికే మొదలైందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ చీఫ్ యూరీ బోరిసోవ్ వెల్లడించారు.
అయితే, ఇది అనుకున్నంత సులువు కాబోదని యూరీ అంగీకరించారు. కాకపోతే, ‘న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీ రంగంలో రష్యాకు అపార నైపుణ్యం ఉంది.. ఈ ప్రాజెక్ట్‌కు ఇది బాగా ఉపయోగపడనుంది… మేం తలపెట్టిన ప్రాజెక్టు చంద్రునిపై మనిషి శాశ్వత ఆవాసం దిశగా కీలక ముందడుగు కానుంది. అక్కడ మున్ముందు ఎదురయ్యే ఇంధన అవసరాలు, డిమాండ్లను తీర్చేందుకు సోలార్ ప్యానళ్లు సరిపోవు… అణు విద్యుతే ఇందుకు సమర్థమైన ప్రత్యామ్నాయం. కాబట్టి బాగా ఆలోచించిన మీదట ఈ ప్రాజెక్టును ప్రారంభించాం’ అని ఆయన వివరించారు.
కానీ, చంద్రునిపై అణు విద్యుత్కేంద్రం ఏర్పాటు మాటల్లో చెప్పినంత సులువేమీ కాదు. ఇందుకోసం ఇప్పటికే ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు యూరీ వెల్లడించారు. తొలి దశలో మానవ ప్రమేయం లేకుండా చంద్రునిపై అణు ప్లాంటు స్థాపన ప్రయత్నాలు పూర్తి ఆటోమేటెడ్ పద్ధతిలో సాగుతాయి. ఇందుకోసం ప్రధానంగా రోబోల రంగంలోకి దింపి.. వాటి సాయంతో పని నడిపిస్తారు. స్పేస్ టగ్బోట్ పేరిట అణు విద్యుత్‌తో నడిచే వ్యోమనౌకను అభివృద్ధి చేసే యోచనలో రష్యా ఉంది.