కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ) నిపుణుల కమిటీ బుధవారం తెలంగాణకు రానుంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13 తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎ్సఏకి లేఖ రాయగా.. ఈ నెల 2న కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఆరుగురితో ప్రభుత్వం కమిటీ వేసిన సంగతి తెలిసిందే.
ఈ కమిటీ హైదరాబాద్‌కు చేరుకున్నాక బుధవారం మధ్యాహ్నం జలసౌధలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇతర అధికారులతో సమావేశం కానుంది. 7, 8 తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనుంది. మళ్లీ 9వ తేదీన హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులు, నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. ఆరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో.. బ్యారేజీల ప్లానింగ్, డిజైన్లు, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓ అండ్ ఎం) అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది. అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి.. దిగువ/ఎగువ భాగాల ఫొటోలు, అన్ని గేట్ల పరిస్థితి, స్టాప్‌లాగ్ గేట్లు, సర్వీస్ గేట్ల పరిస్థితి సహా 19 రకాల ప్రాథమిక సమాచారం అందించాలని కోరింది. కాగా.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.