హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ శుక్రవారం రాత్రి గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో క్రిష్ ఏ10గా ఉన్నారు. సుమారు నాలుగు గంటలపాటు క్రిష్ ను పోలీసులు విచారించారు. క్రిష్ నుంచి డ్రగ్స్ టెస్ట్ కోసం శాంపిల్స్ స్వీకరించారు. క్రిస్ బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను పోలీసులు ల్యాబ్ కు పంపించారు. టెస్టులో పాజిటివ్ తేలితే పోలీసులు క్రిష్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. టెస్టుల్లో నెగిటివ్ అని తేలితే సాక్ష్యంకోసం మరోసారి విచారణకు పిలిచే చాన్స్ ఉంది. అయితే, క్రిష్ విచారణలో పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. పోలీసుల విచారణలో క్రిష్ ఏమి చెప్పాడన్న విషయం సస్పెన్ష్ గా మారింది.
క్రిష్ సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా శుక్రవారమే హాజరయ్యారు. మరోవైపు ఇప్పటికే ప్రధాన నిందితులు గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్ నాథ్ నమూనాలు పాజిటివ్ గా వచ్చినట్లు తెలుస్తుండటం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. ఈ కేసులో 14 మందికి ప్రమేయం ఉందని పోలీసులు జరిపిన దర్యాప్తులో తేలింది. వీరిలో లిషి, సందీప్, శ్వేత, నీల్ పోలీసుల ముందుకు రాలేదు. శ్వేత గోవాలో, సందీప్ కర్ణాటకలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు. లిషి జాడ మాత్రం ఇప్పటికీ చిక్కలేదు. వీరు డ్రగ్స్ వినియోగించకుంటే పోలీసుల ఎదుటకు ఎందుకు రావడానికి వెనకాడుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఆలస్యం చేసే కొద్దీ మూత్రం విశ్లేషణలో డ్రగ్స్ ఆనవాళ్లు తొలగిపోతాయానే కారణంతోనే వారు తప్పించుకు తిరుగుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.