హైదరాబాద్: ఈ ఏడాదిలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి ప్రారంభంలోనే భానుడి ప్రతాపం మొదలయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం నాడు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి వేళలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎల్నినో ప్రభావంతో ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీసే అవకాశాలున్నాయని తెలిపింది. మార్చి-మే మధ్యకాలంలో దేశంలో అనేక చోట్ల సాధారణం కంటే గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ డైరెక్టర్ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించారు.
ఉత్తర, మధ్య భారత్లో మాత్రం మార్చిలో వడగాలుల తీవ్రత లేకపోవచ్చని అన్నారు. ప్రస్తుత ఎల్నినో ప్రభావం వేసవి వరకూ ఉండే అవకాశం ఉందని, ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని అన్నారు.