AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరలోనే రైతు కమిషన్, విద్యా కమిషన్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు. రైతులు, కౌలు రైతుల సాధక బాధకాలు, వాళ్ల సంక్షేమం, వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు సూచనలు అందిస్తుందని తెలిపారు. శుక్రవారం సచివాలయంలో వివిధ సామాజిక సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టాగోష్టి ముచ్చటించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను తెరిచామని, ప్రజా భవన్‌ను ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు అనువుగా అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంద‌న్నారు. అందుకే ప్రజాపాలన కార్యక్రమంలో సంక్షేమ పథకాలకు దరఖాస్తులను స్వీకరించామ‌న్నారు. రాష్ట్ర ఆర్థిక‌ పరిస్థితి, విద్యుత్ పరిస్థితి, సాగునీటి రంగం పరిస్థితిపై పూర్తి వివరాలతో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు. మహిళలు, నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేశామని అన్నారు. రైతులు, నిరుద్యోగులకు మేలు చేసేందుకు మరిన్ని చర్యలు చేపడుతామన్నారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, రమ మేల్కొటే, ప్రొఫెసర్ రియాజ్, ప్రొఫెసర్ పురుషోత్తం, గాదె ఇన్నయ్య, తదితర ప్రతినిధులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

కౌలు రైతుల ర‌క్ష‌ణ‌కు అఖిల‌ప‌క్ష స‌మావేశం..
కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని రేవంత్ చెప్పారు. అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలనే ఆలోచనలను పంచుకున్నారు. రైతు భరోసా అనేది రైతులకు పంటలకు పెట్టుబడి సాయంగా అందించేదని, రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

ANN TOP 10