కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉచిత సోలార్ విద్యుత్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజన పథకానికి ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా అర్హులైన కోటి కుటుంబాలకు ఈ పథకం ద్వారా 300 యూనిట్ల వరకూ సౌర విద్యుత్ ఉచితంగా లభించనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అధికారికంగా వెల్లడించారు. ఇందు కోసం కేంద్రం రూ.75,021 కోట్లు ఖర్చు చేయనుందని వెల్లడించారు.
ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనుంది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఖరీఫ్ సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని ఫర్టిలైజర్స్ పైనా సబ్సిడీని కేంద్రం అందించనుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందుతుందన్నారు. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే మూడు రకాల ఫర్టిలైజర్స్ రైతులకు సబ్సిడీ ధరలో లభించనున్నట్టు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. మొత్తం రూ. 24, 420 కోట్ల సబ్సిడీ అందించనుందని, ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఈ స్కీమ్ వర్తిస్తుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.









