కరీంనగర్: ఓ కానిస్టేబుల్ చేసిన సాహసం వ్యక్తి ప్రాణాలు నిలిచేలా చేసింది. ప్రజలకు రక్షణగా పోలీసులు నిలుస్తారనడానికి జిల్లాలో జరిగిన ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. పురుగుల మందు తాగిన ఓ వ్యక్తిని సదరు కానిస్టేబుల్ ఎంతో శ్రమించి మరీ కాపాడారు. దీంతో సదరు పోలీసుకు అభినందలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం భేతిగల్‌లో ఓ వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. గ్రామానికి చెందిన సురేష్ కుటుంబసభ్యులతో గొడవపడి పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన గ్రామస్థులు వెంటనే 100కు సమాచారం ఇచ్చారు. బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డు కిన్నెర సంపత్‌లు అక్కడకు చేరుకోగా.. అప్పటికే సురేష్ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్ జయపాల్ హుటాహుటిన సురేష్‌ను భుజాన వేసుకుని మరీ పొలం గట్ల మీదుగా సుమారు 2 కిలోమీటర్లు నడిచి గ్రామానికి చేరుకుని.. అక్కడి నుంచి కుటుంబసభ్యుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. సకాలంలో సురేష్‌ను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బతికిబయటపడ్డాడు. ప్రస్తుతం సురేష్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే యువకుడిని రక్షించడంలో కానిస్టేబుల్ చేసిన సాహసం పట్ల పోలీస్ ఉన్నతాధికారులు, స్థానికులు అభినందించారు.
