మంగళగిరిలో మంగళవారం వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ‘మేం సిద్ధం-మా బూత్ సిద్ధం’ పేరిట నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం జగన్ ప్రసంగించారు. రాబోయే 45 రోజులు మనకు అత్యంత కీలకం అని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయి నుంచి వైసీపీ బలంగా ఉందని, చేసిన మంచి పనులే మనకు అండ… ఆ ధైర్యంతోనే ప్రజల్లోకి వెళ్లండి… మనం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించండి అని కర్తవ్య బోధ చేశారు. వైసీపీ గెలవకపోతే సంక్షేమం ఆగిపోతుందని ప్రజలకు చెప్పండి అని స్పష్టం చేశారు. ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం… ఈ క్లాస్ వార్ లో జగన్ గెలిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది… జగన్ గెలిస్తేనే సంక్షేమం కొనసాగుతుంది అని పేర్కొన్నారు.
“మనం చంద్రబాబులాగా కాదు… చేప్పిందే చేస్తాం… చేసేదే చెబుతాం. చంద్రబాబు అడ్డగోలు హామీలు ఇవ్వడంలో దిట్ట. గతంలో చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలన్నీ నాకు గుర్తే. ఆచరణ సాధ్యం కాని హామీలను కూడా మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను వంచించాడు. వారి పార్టీ వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టోను కూడా తీసేశాడు” అంటూ సీఎం జగన్ విమర్శించారు.
వైసీపీ టికెట్లు దాదాపు ఖరారయ్యాయని వెల్లడించారు. ప్రజలకు నా వంతు నేను చేశాను… ఇక మీ వంతు అంటూ వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గతంలో 151 సీట్లు వచ్చాయి… ప్రజలకు ఎంతో మంచి చేశాం… ఈసారి 175 ఎందుకు రావు? అని అన్నారు.