AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లక్ష కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైటెక్స్‌లో హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండో ఫేజ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైందని.. వీటి ద్వారా 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని రేవంత్ రెడ్డి వివరించారు.

త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండో ఫేజ్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైటెక్స్‌లో హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ 2024 అవార్డుకు ఎంపికైన నోబెల్ బహుమతి గ్రహిత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్.సెమెంజాను సీఎం అభినందించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సెమెంజాకు అవార్డు అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. 300 ఎకరాల్లో రూ.2000 కోట్ల పెట్టుబడులతో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైందన్నారు. దీంతో మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో ఈ ఫార్మా విలేజ్ లను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలున్న పరిస్థితుల్లో హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న బయోఏషియా సదస్సు కీలకంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బయోసైన్స్ రాజధానిగా హైదరాబాద్ నేడు యావత్ మానవాళికి ఒక భరోసాగా నిలిచిందన్నారు. వైరస్ భయాలను ధీటుగా ఎదుర్కోగలమనే నమ్మకాన్ని హైదరాబాద్ కలిగించిందని.. ఇప్పుడు ప్రపంచంలో వినియోగించే ప్రతి 3 వ్యాక్సిన్లలో ఒకటి హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతోందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

ANN TOP 10