AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నువ్వు మొగోడివైతే ఒక్క సీటైనా గెలిచి చూపించు.. : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జన జాతర పేరుతో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్‌లో తన గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను తాత, తండ్రి పేరు చెప్పుకొని పైకి రాలేదని.. అవినీతి పరులను, దుర్మార్గులను తొక్కుకుంటూ పైకి వచ్చానంటూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. చేవెళ్ల సభ నుంచి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. “దమ్ముంటే, మొగోడివైతే.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించు.. నీఅయ్యా నువ్వు వస్తావో.. నీ అయ్యా వస్తాడో రమ్మను.. మా కార్యకర్తలు చూసుకుంటారు.” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“ప్రభుత్వం కూలిపోతుంది అని ఎవరైనా అంటే.. వాళ్లను గ్రామాల్లో కార్యకర్తలు చెట్టుకు కట్టేసి కొడతారు. అల్లాటప్పా గాళ్లం కాదు.. సీఎం అయ్య పేరు చెప్పుకుని కుర్చీలో కూర్చోలేదు. కార్యకర్త స్థాయి నుంచి జెండాలు మోసి పోరాటాలు చేసి.. లాఠీ దెబ్బలు తిని.. అక్రమ కేసులు ఎదుర్కొని.. చంచల్ గూడా, చర్లపల్లి జైలులో మగ్గినా తలొంచకుండా నిటారుగా నిలబడి.. నిన్ను నీ అయ్యను, నీ బావను బొందపెట్టి.. ఈ కుర్చీలో కూర్చున్నాం.” అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఈ రోజు ఆ కుర్చీ తనకు ఉందంటే అది కార్యకర్తల త్యాగం… పోరాట ఫలితమే అన్నారు. ఈ కార్యకర్తలు తనను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు… నువ్వు పుట్టించిన నీ అయ్య కూడా కాదు… వాళ్ల దేవుడు వచ్చినా ఆ కుర్చీని మీరు తాకలేరని వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియా ఉంటే మేం గెలిచేవాళ్లమని కేటీఆర్ అంటున్నారని… కానీ ఉన్న టీవీలు అన్నీ ఆ సన్నాసి సుట్టపోల్లవే అని ఘాటుగా విమర్శించారు. మాకు ఏమైనా టీవీ ఉందా? పేపర్ ఉందా? సాయంత్రం సేద తీరేందుకు జుబ్లీహిల్స్‌లో సినిమా వాళ్ల గెస్ట్ హౌస్ ఉందా? అని కేటీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మా కార్యకర్తల కష్టఫలంతో… వారు నిలబడి కొట్లాడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పులను తమ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారని వెల్లడించారు.

ఆయన ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామని చెబుతున్నాడని… అలాగే కృష్ణా నగర్‌లో ఏదైనా బ్రోకర్ దందా పెట్టుకుంటే నీ వ్యాపారం బాగానే నడుస్తుందని చురక అంటించారు. ఇప్పటికీ వారికి సిగ్గురాలేదని… ఆ కుటుంబం దోచుకుంటేనే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టారనే విషయం ఆయనకు అర్థం కాలేదన్నారు. అడవి పందులు చెరుకు తోట మీద పడినట్లుగా పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. అందుకే అడవి పందులకు కరెంట్ తీగలు పెట్టి పంటను కాపాడుకున్నట్లు తెలంగాణ ప్రజలు కరెంట్ వైర్లు పెట్టి బీఆర్ఎస్‌ను బలిచ్చి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వచ్చుకున్నారన్నారు.

ANN TOP 10