కాంగ్రెస్‌పై అపనమ్మకాలు సృష్టించే కుట్ర ప్రతిపక్ష నేతలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం చేవెళ్లలో కాంగ్రెస్ నిర్వహించిన జన జాతర సభ నిర్వహించింది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. తప్పుడు కూతలు కూసినవాళ్లు అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారని మండిపడ్డారు. గాంధీ కన్న కలలను నిజం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు.
అధికారంలోకి వచ్చిన రెండో రోజులోనే 2 గ్యారంటీలను అమలు చేశామని, ఇప్పుడు మరో రెండు గ్యారంటీలను ప్రారంభించామని వెల్లడించారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ. 1300లకు పెంచారని, అలాగే పేదలు కరెంట్ వాడలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. అందుకే తాము 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ ఇచ్చి అదుకుంటున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.