రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా రోజా స్పందిస్తూ… తాను ఎవరి కోసమో ఎప్పుడూ చేపల పులుసు చేయలేదని అన్నారు. జగన్ తన ఇంటికి ఎప్పుడు వచ్చారో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. జాక్ పాట్ లో సీఎం అయిన రేవంత్ కు ఏం మాట్లాడాలో తెలియక ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారని అన్నారు. గతంలో కూడా రేవంత్ పై రోజా మాట్లాడుతూ… ఆయన రేవంత్ రెడ్డి కాదని, కోవర్టు రెడ్డి అని ఎద్దేవా చేశారు. కేవలం తన గురువు చంద్రబాబు కోసమే కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఏపీ మంత్రి చేపల పులుసు వండిపెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ రోజా వండిన చేపల పులుసు తిన్నారని… ఆ తర్వాత తెలంగాణ వాటా నీళ్లను రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ ఇచ్చారని ఆయన విమర్శించారు.