గృహ జ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, మహాలక్ష్మీ స్కీమ్ కింద రూ. 500 గ్యాస్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి గృహ జ్యోతి, మహాలక్ష్మీ రెండు స్కీమ్‌లను ప్రారంభించారు. సబ్సిడీ సిలిండర్ స్కీంకు రాష్ట్రంలో 40 లక్షల మంది అర్హులుగా.. అలాగే 11. 58 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. మాట ఇస్తే.. కాంగ్రెస్ వెనకడుగు వేయదని, రాష్ట్రంలో ప్రతి పేద ఇంట్లో వెలుగులు నింపుతాయని చెప్పారు. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నదే తమ తపన అని అన్నారు. అందుకే ప్రజా పాలనలో దరఖాస్తులు స్వీకరించామని గుర్తు చేశారు.
అయితే చేవెళ్లలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని అనుకున్నామని, కానీ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల లాంఛ్ చేయలేకపోయామని స్పష్టం చేశారు. ఆనాడు దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చామని, రాష్ట్రంలోని పేదలకు ఈ పథకాలు అందించేందుకు విధివిధానాలు రూపోందించామని వెల్లడించారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నామని తెలిపారు. తాము ప్రకటించిన గ్యారంటీలను నూటికి నూరు శాతం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం: డిప్యూటీ సీఎం
లబ్ధిదారులకు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలియజేశారు. దేశమంతా ఈ గొప్ప కార్యక్రమం కోసం ఎంతో ఎదురు చూస్తుందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. బడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుందని, తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలపై బీఆర్‌ఎస్ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే.. హామీలు అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.